మావిడాకులు అల్లూరి గౌరీలక్ష్మి - Sun, 7 Feb 2010, IST (ఆంధ్రప్రభ డైలీ)
జర్రున ముక్కుచీదింది భార్య 'తెలంగాణా'.
'ఏమయ్యింది' అనుమానంగా చూశాడు భర్త 'సీమాంధ్ర'.
భార్య: నీతోనే సంసారం జెయ్యలేను, నాకు విడారులియ్యి
భర్త: మళ్లీ మొదలెట్టావా? ఇప్పుడేం కష్టమొచ్చింది?
భార్య: అసలు నిన్ను కట్టుకున్న కాడి నుంచీ నాకన్నీ కష్టాలే!
భర్త: ఇప్పుడేమంటావ్!
భార్య: ఇంకేమంటాను! నన్నొదిలెయ్యి, సుకంగుంటాను.
భర్త: ఇద్దరం కలిసుంటేనే లోకంలో మంచి పేరుంటుందే!
భార్య: నిజం చెప్పు నన్నెందుకు వదలవు నువ్వు.
భర్త: ఎందుకేంటెహె! నీమీద ప్రేమ నాకు.
భార్య: ప్రేమకాదు, నన్ను దోచుకోవాలని.
భర్త: భార్యాభర్తల మధ్య దోపిడీ, పీడ ఉండవే. ఒకరికొకరు అణకువగా ఉండి అభివృద్ధి చెందుతాం.
భార్య: అసలు నువ్వు నన్ను ఎదగనిచ్చావా?
భర్త: పెళ్లినాటి నుండీ ఇప్పటికి చాలా ఎదిగావు.
భార్య: నన్నొదిలేస్తే నేనింకా ఎదిగేదాన్ని.
భర్త: ఏమో! ఈ మాత్రం కూడా ఉండేదానివి కాదేమో!
భార్య: తప్పకుండా ఉండేదాన్ని నీ పెత్తనం లేకపోతే.
భర్త: ఆలూమగలన్న తర్వాత ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోకపోతే పక్కమతం వాళ్లు చేస్తారా!
భార్య: ఆ బూచుతా, ఈ బూచుతా చూపెట్టి మన పెళ్లి చేశారు పెద్దలు.
భర్త: అప్పటి అవసరాలు, భయాలూ మర్చిపోయావు. అన్నీ నేర్చుకున్నావు. మొగుడవసరం తీరిపోయింది నీకు.
భార్య: అవును. నువ్వునాకొద్దు. ఖుల్లంఖుల్ల చెబుతుంటె సమజ్‌గాదా నీకు!
భర్త: నేను కానిమాటేమన్నా అంటున్నానా! కలిసుందామంటున్నా! అది మంచిమాటే కదా! నేను పెద్ద మనసుతో అంటుంటే నీకు లోకువగా ఉంది. ఎవరైనా ప్రేమ ఉన్నప్పుడే కలిసుందామంటారు. నీకు నా మీద ప్రేమలేదు. అదీ సంగతి (నిష్టూరంగా)
భార్య: చూడయ్యా! నీ భాషనాకర్థం కాదు. నీ తెలివి మాటలు నాకు రావు. నా భాష ఏరు. నాకత ఏరు.
భర్త: యాభైమూడేళ్లకి గుర్తొచ్చిందానీకు మన భాషల్లో తేడా ఉందని.
భార్య: ఔ మల్ల! నన్నెపుడూ ఎక్కిరిస్తవు.
భర్త: నువ్వుమాత్రం ఆయ్! ఓయ్! అని ఎన్నిసార్లు వెక్కించలేదు? మర్చిపోయావు.
భార్య: అయన్నీ వదిలెయ్! నిన్నేమర్చిపోదామనుకుంటున్నా.
భర్త: నీ ఇష్టం వచ్చినప్పుడు పొమ్మంటే నేను నోరు మూసుకుని వెళ్లిపోవాలా!
భార్య: అవును ఎల్లిపోవలసిందే! ఈ ఇల్లునాది. నేనీడనే ఉంటా.
భర్త: మానాన్నిచ్చిన డబ్బులన్నీ తెచ్చి ఈ ఇంటి మీద పెట్టి పేద్ద మేడచేశాను. ఇది నీకిచ్చేసి నేను చిప్పపట్టుకొనిపొమ్మనడం బావుందా నీకు!
భార్య: ఎంతపెట్టావో చెప్పు లెక్కజేసిచ్చేస్తా!
భర్త: ఈ మేడ మనిద్దరిదీ అనుకొని నా సొమ్మంతా పెట్టాను. నువ్విలా అంటావని తెలిస్తే లెక్కరాసేవాడిని. నాకు నీలా విడిపోయే దురాలోచనే ఉంటే మా ఊర్లోనే మేడ కట్టుకునే వాడిని.
భార్య: ఇప్పుడు మాత్రమేమయిందిపోయి కట్టుకో మేడ.
భర్త: ఇప్పుడు నాకక్కడ ఏమీలేదు. అన్నీ అమ్మి తెచ్చి ఇక్కడే పెట్టాను. ఇప్పుడు అంతానాదే పొమ్మంటున్నావ్! ఇంతన్యాయమా!
భార్య: ఏమన్యాయమున్నది! ఏం లేదు! అరవైతొమ్మిదిలోనే విడాకులడిగన. ఇప్పిస్త, ఇప్పిస్త అని మా చెన్నమావయ్య ఆఖర్న కలిసిపోండని చెప్పికుర్సీలో కూసున్నడు.
భర్త: అంతిష్టంలేని దానివి డెభైమూడులో నాక్కోపమొచ్చి నిన్నొదిలిపోతానన్నప్పుడు ఊరుకున్నావెందుకు? అప్పుడే ఒప్పేసుకుంటే ఇప్పటికి ఇద్దరం హాయిగా ఉండేవాళ్లం.
భార్య: అప్పుడునేను చిన్న పిల్లని తెలివిలేనిదాన్ని పెద్దలంతా చెప్పబట్టే కాపురం చేస్కుందామనుకున్న. నీకు తెలివెక్కువ. నీతోనేను వాదులాడలేను. నన్నొలెయ్యి.
చిలికి చిలికి గాలివానయ్యింది. భార్య తిండితినడం మానేసింది. భర్త మౌనంగా, పౌరుషంగా ఊరుకున్నాడు. చిదంబరం అంకులొచ్చాడు. భార్య చెప్పిన కష్టాలన్నీ ఓపికగా విన్నాడు. భర్త తననెలా పీడించుకునితిని లాభపడ్డదీ. తనెలా నష్టపోయిందీ కళ్లకు కట్టినట్టు చెప్పింది భార్య.
''అమ్మాయ్! నువ్వింత బాధలుపడుతున్నట్టు నాకు తెలీదుసుమా! నీకు, నేను దగ్గరుండి విడాకులిప్పిస్తానమ్మా. నీకున్యాయం చేస్తాను. నన్ను నమ్ముతల్లీ!'' అన్నాడు చిదంబరం అంకుల్. భార్య కళ్లుతుడుచుకుంది.
ఇది విన్న భర్త అవాక్కయ్యాడు. ఊహించని దెబ్బకి కెవ్వుమన్నాడు. తన బంధు బలగాన్నేసుకుని చిదంబరం ఇంటికి పరిగెత్తాడు. ''మమ్మల్ని విడదీయడం బావుందా అంకుల్! మేం యాభైమూడేళ్లు కాపురం చేశాం. ఏవో గొడవలొస్తే మాత్రం విడాకులిప్పించేస్తారా! నా తప్పు చెబితే దిద్దుకుంటాను కదా! ''అనికళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ''మీ అబ్బాయైతే ఇలాగా చేస్తారా?'' అని నిష్టూరమాడాడు.
చిదంబరం అంకుల్ ఆలోచనలో పడ్డాడు. ''అబ్బాయన్నదీ నిజమే కదా'' అని తల గోక్కుని అన్ని ఊర్లకీ పెద్దమ్మ సోనియమ్మతో చర్చించాడు. ఆవిడంతావిని తలపంకించింది. ''చూద్దాం! కొన్ని రోజులు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా నిమ్మళంగా ఉండమను. అసలేంజరుగుతోందీ, అన్నీ ఆరాతీద్దాం. అప్పుడు విడాకులిప్పించే సంగతి మాట్లాడదాం'' అంది సోనియమ్మ.
ఈ సంగతి వచ్చి చిదంబరం అంకుల్ భార్యాభర్తలిద్దరికీ చెప్పాడు. భర్తకాస్త ఊరటచెందాడు. భార్యకి వళ్లు మండింది.
''నేనడుగుతున్నా! విడాకులు! ఇప్పించాలి! అంతే గానీ ఆయన్నీ, అందర్నీ అడుగుడేంది? నాకు తెల్వక అడుగుతున్నా! ఇదేంన్యాయం!'' కోపంగా అరిచింది భార్య అంకుల్‌ని.
''మీ ఇద్దర్నీ అడిగి, అన్నీ విన్నాక నిర్ణయిస్తారు కానీ, ఏకపక్షంగా ఎలా ఇప్పిస్తారమ్మా? విడాకులు! ఇలా అమాయకం మాటలు మాట్లాడతావ్! ఏమన్నా అంటే మామీద కోప్పడతావ్!'' అని సముదాయించి వెళ్లాడు చిదంబరం అంకుల్.
భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా మిగిలారు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరిమధ్యా యుద్ధం ఆగి, ఆగి సాగుతోంది. అటువాళ్లూ, ఇటువాళ్లూ పార్టీలుగా ఏర్పడి వార్తలు పుట్టిస్తున్నారు. పితూరీలు మోస్తున్నారు. అగ్నికి ఆజ్యాంపోస్తూ కొందరూ, చల్లారుస్తూ కొందరూ టైంపాస్ చేస్తున్నారు బంధువులు.
ఒక రోజు..
భార్య: మనపెళ్లయినప్పుడే మా నేరూతాతన్నాడు. మన పిల్ల అమాయకురాలు. ఆపిలగాడితో ఎట్లా ఏగుతాదోనని...అదే నిజమైంది.
భర్త: తాతలంతా ప్రేమకొద్దీ అలాఅంటార్లే! పెళ్లాం అమాయకురాలు కదా అని ఏ భర్తైనా భార్యను కొట్టిచంపేసుకుంటాడా?
భార్య: ఇప్పుడదేనువ్వుచేస్తుంది.
భర్త: ఇలా అభాండాలేస్తేనే నాకు కోపమొచ్చేది.
భార్య: ఆఖరిమాట చెప్పు. నేనంటే నీకు గౌరవం ఉందా, లేదా!
భర్త: ఉంది.
భార్య: అయితే విడిపోదాం పద!
భర్త: పెద్దోళ్లకిచెప్పినాం కదా! వాళ్లేది మంచిదంటే అదే చేద్దాం. వాళ్లు విడిపోమంటే విడిపోదాం.
భార్య: అదీ! ఆ మాటమీదుండు.
భర్త: ఉంటాను. నువ్వు కూడా పెద్దవాళ్ల మాటవిను.
భార్య: సరే! అట్లనేలే.
ఇద్దరూ వాదులాడుకుని, అలిసిపోయి నిద్రపోయారు. ఇద్దరికీ కలలో చిదంబరం అంకుల్ కనబడ్డాడు. ఇద్దరూ సంతోషపడ్డారు. ఏం చెబుతాడోనని.
భార్యకొచ్చిన కలలో చిదంబరం అంకుల్ ''మీ ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. మీరిద్దరూ ఆనందంగా విడిపొండి'' అని చెప్పాడు. భర్తకొచ్చిన కలలో చిదంబరం అంకుల్ ''మీ ఇద్దరి విబేధాలకీ కారణమైన సమస్యలన్నిటినీ పరిష్కరించి మీ కాపురం నిలబెడుతున్నాం. మీ ఇంట్లో శుభకార్యం జరుపుకోవడానికి మావిడాకులు కట్టుకోండి'' అని చెప్పాడు.
ఇద్దరూ ఆనందంగా కళ్లుతెరిచారు. ఒకరి కొకరు కనబడడంతో నోళ్లు తెరిచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment