(ఆంధ్రప్రభ) - Thu, 14 May 2009, IST
హైదరాబాద్,మే13ః ఎన్నికలయ్యాక కొత్తగా పార్టీ పెట్టిన యువ పార్టీ అధినేత, మాజీ హీరో రఘుబాబు ఆ అలుపు తీర్చుకోవడానికి వారం రోజులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు. మే ఫస్ట్‌కి తెప్పరిల్లి సిటీలో దిగాడు. అక్కడక్కడా ఎర్రజెండాలెగరేశాడు. 'కామ్రేడ్స్' అంటూ ఈ మధ్య అలవాటైన హై పిచ్‌లో స్పీచ్ లిచ్చాడు. మర్నాటినుంచీ పనేమీ లేక బోర్‌కొట్టేసింది.అది చూసి పి.ఏ. ఓ సలహా చెప్పాడు. సార్ మీరు ఊళ్లో లేనపుడు వచ్చిన వార్తాపత్రికలన్నీ అస్సలు చూడలేదు. అవన్నీ ఒకసారి చూస్తే బావుంటుందన్నాడు. ''నిజమే! ఆమధ్య ప్రచారంటైమ్‌లో కూడా సాయంత్రానికి అలిసిపోయే వచ్చేవాణ్ణి. ఎవరైనా చదివి వినిపిస్తుంటే నిద్రొచ్చేసేది. మాకసలు సినిమాన్యూస్ మాత్రమే చదివే అలవాటు.తెప్పిం''చన్నాడు రఘుబాబు. కూర్చుని ఓ పేపర్ విప్పాడు. అది ఎలక్షన్‌కి వారంముందు పేపర్. రఘుబాబుని మరో పార్టీ మహిళానేత రాణి ఘాటైన మాటలతో విమర్శించింది. మర్నాడు పేపర్లో యువపార్టీలోని మహిళారత్నాలిద్దరూ రాణిఇంటిపై దాడికెళ్ళి కుండీలన్నీ పగలగొట్టి నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి ఆవిడ పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసి, తూర్పారబట్టి చెమటలు తుడుచుకున్నారు. నేనంటే ఎంత ప్రేమో నా పార్టీ ఆడపడుచులకి ఈసారి రాఖీపండక్కి వీళ్ళిద్దరికీ చీరలు పెట్టాలి. అప్పటికి నేను సి.ఎం.గాఉంటానేమో! అనుకోగానే రఘుబాబుకి సిగ్గు ముంచుకొచ్చింది. మరోపేపర్ తీశాడు.టిక్కెట్లమ్ముకున్న యువపార్టీ అన్న హెడ్‌లైన్స్. రాష్ట్ర చరిత్రలో ఇలా స్టేజిషోల్లాగా టిక్కెట్లమ్ముకున్న పార్టీ ఇదే అంటూ ఏకిపారేసిందా పేపరు. మర్నాడు యువపార్టీ నాయకులిద్దరు ''ఇదంతా మా పార్టీకొచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి మిగిలిన పార్టీల వాళ్ళు జల్లుతున్న బురద తప్ప మరోటి కాదు'' అని ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాడు రఘుబాబు.ఆమర్నాడింకో పేపర్- యువపార్టీవాళ్లమ్ముకున్నటికెట్లు, ధరలు వివరాలంటూ ఓపట్టికవేసింది.మొత్తంరాబడివెయ్యి కోట్లని చూపించారు. రఘుబాబు గుండె గుభేల్మంది. అవమానంతో మొహంజేవురించింది. వెంటనేపి.ఏ.ని పిల్చి అందుబాటులో ఉన్న పోటీ చేసిన అభ్యర్థులందర్నీ పిలవమన్నాడు. మర్నాడంతా హాజరయ్యారు. ఈమీటింగు అన్న, తమ్ముడు, బావమరిదికీ తెలీకుండా ఏర్పాటైంది. అంతా మౌనంగా కూర్చున్నారు. రఘుబాబు ''చూడండి బ్రదర్స్! మీలో ఎవరైనా పార్టీ టిక్కెట్ల కోసం డబ్బులిచ్చారా?'' అని సూటిగా ప్రశ్నించాడు.''అలా ఎవరన్నా ఇచ్చుంటే ఇప్పుడే వారందరికీ నేను డబ్బులు వాపస్ ఇచ్చేస్తా''నని ఆవేశంగా అన్నాడు. ''మీ దగ్గర డబ్బులు తీసుకున్న రాస్కెల్స్‌ని ఒక్కొక్కణ్ణి ఏరిపారేస్తా''నంటూ టేబుల్ మీద పిడిగుద్దులు గుద్దాడు. నేను నా ప్రాణమైన ప్రజలకి సేవచేయాలనీ, నా జీవితాన్ని వారికంకితం ఇవ్వాలన్న సదుద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. తుచ్ఛమైన డబ్బు సంపాదనకోసం కాదు. దానికోసమైతే నేను సినిమా తీసుకునే వాణ్ణి. ఈ పేపర్‌లో చదివాను. ఇపుడే నాకీ నిందగురించి తెలిసింది. నా గుండెలు మండిపోతున్నాయి. అవమానం తట్టుకోలేకపోతున్నా. ఏం జరిగింది నిజం చెప్పండి బ్రదర్స్!'' అంటూ కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు. అభ్యర్థులంతా బిక్కమొహాలేశారు. ఒకరి మొహాలు మరొకరు చూశారు.నిజం చెబితే ఏంగొడవో, అని బెదిరిపోయారు. అయినా చక్రం తిప్పేవాళ్ళు వాళ్ళేగానీ ఇతను కాదు. ఇతని మాటల్ని సీరియస్‌గా తీసుకుంటే కొంపంటుకుంటుందన్న నిర్ధారణ కొచ్చారు. ఒక అభ్యర్థిలేచి ''సార్! పేపర్లవాళ్ళన్నీ అబద్ధాలూ, ఊహాగానాలూ రాస్తారు. మా అందరి గురించీ మా నియోజకవర్గాల్లో సర్వేచేయించి గెలుస్తామన్న రిపోర్ట్ వచ్చాకే మాకు సీట్లిచ్చారు సార్. మీ ఫ్యామిలీ వాళ్ళను అనుమానించకండి సార్! వాళ్ళు దేవుళ్ళు సార్'' అన్నాడు కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ. హీరోగారి మొహంలో కారుమేఘాలు తొలగిపోయాయి. ఈసారి ఆనందభాష్పాలు రాలాయి. అభ్యర్థులంతా ''వస్తాం సార్'' అంటూ వడివడిగా బైటికి నడిచారు. రాంబాబు, బాబ్జీఅనే ఇద్దరు హీరోగారి వీరాభిమానులు. వాళ్ళిద్దరూ మాత్రం లేవకుండా కూర్చున్నారు. అంతా వెళ్ళాక తలుపులెసి ఇద్దరూ హీరోకి చెరోపక్కా నిలబడి మొత్తంటిక్కెట్లకి వెయ్యికోట్లకి లెక్క చెప్పారు. తామిద్దరూ కూడా ఇచ్చామని రసీదులు చూపించారు. హీరోగారు వాళ్ళిద్దరి భుజాలమీదా చేతు లెసి ''ఈ విషయం మరెక్కడా చెప్పకండి. మీ ఖర్చుకి తగిన ప్రతిఫలం నేనుచూపిస్తాను. మీరునాకు ముందేచెబితే మీ డబ్బు లివ్వనిచ్చేవాణ్ణి కాదు.'' అన్నాడు ప్రేమగా. ''ఫర్వాలేదు బాబూ! మీ అభిమానం మా మీదుందంతే చాలు'' అంటూ వాళ్ళిద్దరూ ఆనందంగా వెళ్ళిపోయారు బైటికి. ''వురే! నేను సెప్పలేదేంట్రా! బాబుగారెంతైనా మనూరోడు. అలా డబ్బుమడిసిగాదు. ఆయనసుట్టూ ఉన్నోళ్ళు ఆయనకి తెలీకుండా తీసు కున్నారు. రేపొద్దున్న ఆళ్ళపని పడతానన్నారు కదా! ఎంతైనా రఘుబాబు మనసున్న మా రాజు.'' అన్నాడు రాంబాబు ఆనందంగా. ''మీ ఇద్దరికష్టం ఉంచుకోను, మీకోదారికూడా సూపిత్తా నన్నారు చూశావా!'' అన్నాడు బాబ్జీతృప్తిగా. ''మనరఘు బాబు గెలిత్తే సాలెహే!! మనకేం రాకపోయినా ఫర్వాలేదు'' అన్నాడు రాంబాబు. అక్కడ రఘుబాబు కాలిక్యులేటర్‌తెచ్చి పేపర్‌లో వచ్చిన వెయ్యికోట్ల వివరాలూ, రాంబాబూ బాబ్జీ చెప్పిన వివరాలూ సరిపోల్చాడు. రెండూ సరిపోయాయి. మరయితే పేపర్లో వార్త నిజమేనా! అయితేమరి నాకు అన్నయ్య, తమ్ముడు, బావమరిదీ చెప్పిన లెక్క మూడు వందల కోట్లకే. మరి మిగిలిన ఏడు వందల కోట్లూ??? రఘుబాబు టెన్షన్‌తో తలపట్టుకున్నాడు గట్టిగా.