Published in ఆంధ్రప్రభ 15th Oct 2014
నిన్నటివరకూ అంతా కలిసున్నది చరిత్రే. దాన్ని చెరపడం కాదు మన పని. కొత్త చరిత్ర సృష్టించాలి. అది ఆదర్శనీయంగా ఉండాలి. తెలుగుజాతి రెండు శిరస్సులున్న మహావృక్షం అని చాటాలి. దేశంలోని వివిధ రాషా్ట్రల ముందు మన జాతి చిన్నబోకూడదు. విడిపోయాక విజయాలు సాధించాలంటే కలిసున్నప్పటి సాక్ష్యాలు చెరిపెయ్యకూడదు.
ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలనూ, మరికొన్ని వ్యాఖ్యలనూ, సందర్భాలనూ చూసిన తరువాత మనసులో కలిగిన ఆవేదన పంచుకోవాలనిపించింది. అందుకే ఈ వ్యాసం రాస్తున్నాను.
ధైర్యంగా, నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘విడిపోయి అత్మీయుల్లా కలిసుందాం’ అన్న ఆదర్శం కనుమరుగైంది. ‘ఎలాగూ విడిపోయాం. వైషమ్యాలకు తెరతీద్దాం. నాలుగుమాటలని సంతృప్తి పడదాం’ అన్న ధోరణి ఎదురవుతోంది. తెలంగాణ పెద్దలూ, రాజకీయ నాయకులూ ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన నష్టాన్నీ, ఒప్పందం అమలుజరగని తీరునూ తమ ప్రజలకు సులువైన భాషలో చెప్పే క్రమంలో, ఆ తొందరలో జరిగిన తప్పిదమిది. నిజానికి పొట్టచేత బట్టుకుని, తమ రాజధాని అన్న మమకారంతో హైదరాబాదు చేరిన ఆంధ్రులు చేసిన అన్యాయం ఏమీలేదు. రెండు రాషా్ట్రలు ఏర్పడినా, ప్రస్తుతానికి కొందరు ఆంధ్ర ప్రభుత్వోద్యోగులూ, వారి కుటుంబాలూ, వారికి సహాయంగా పరోక్ష ఉపాధి పొందుతున్న వారు మాత్రమే హైదరాబాదు వదిలి వెళతారు. ఈ సంఖ్య చాలా తక్కువ శాతం. ఈ మాత్రం దానికి విరోధాలు పెంచుకోవడం అవసరమా? విజ్ఞులు, వివేకవంతులైన రాజకీయ నేతలు ఇటువంటి భేదభావాలను మొగ్గలోనే తుంచే కార్యక్రమం చేపట్టడం అత్యవసరం.
తమని తామే పాలించుకోవాలన్న తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. వారు ఆ ఆనందాన్ని హుందాగా నిలబెట్టుకోవాలి. ప్రభుత్వంలోని వారు తక్షణమే ఉమ్మడి రాష్ట్రం వల్ల తాము నష్టపోయిన ఉద్యోగాలు, ఇతర సదుపాయాలూ, అవకాశాలూ నేటి యువతకు అందే పని మీద దృష్టి నిలపడం మంచిది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంత ఉన్నదీ లెక్కలు తీసి, వారిలో ఎంతమంది కి ఎటువంటి ఉపాధి కల్పించగలరో ఒక ప్రణాళిక వెయ్యాలి. వారి ఉత్సాహాన్ని బట్టి వివిధ వృత్తి విద్యలు నేర్పిస్తూ, తగిన శిక్షణఇస్తూ అందరికీ ఉపాధి కల్పించేట్టుగా ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగితే బంగారు తెలంగాణ తప్పక సాకారమవుతుంది. ఇతర రాషా్ట్రల వాళ్ళ వలె ఆంధ్రులు ఇప్పుడు పొరుగురాష్ట్రం వారిగా ఉం టారుతప్ప, ఆంధ్రులంతా ఇల్లు ఖాళీచేసినట్టు వెళ్ళిపోరు కదా! రెండు తెలుగురాషా్ట్రల మధ్య పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉంటాయి కదా.
ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయి, అలరారుతున్న వేళ, ఒకే భాష మాట్లాడే రెండు రాషా్ట్రల ప్రజల మధ్య ఎటు వంటి పొరపొచ్ఛాలూ ఉండకూడదు కదా! ఎవరెన్ని మాట్లాడినా, ఇంటికి చేరాక మన పక్కింటి వాళ్ళతోనే మనకి అవసరమొస్తుంది. ఇరుగుపొరుగుతో మనకి సఖ్యతే అనివార్యం. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి జరిగిన అన్యాయానికి ఆంధ్ర పాలకులెంత కారణమో, తెలంగాణ పాలకులూ అంతే కారణం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలెంత అమాయకులో ఆంధ్ర ప్రజలూ అంతే అమా యకులు. తెలంగాణ భూముల ఆక్రమణ విషయాల్లాంటివి పెద్దవి. రాజకీయ పరపతి ఉన్నవారు కొందరు చౌకగా కొనుక్కున్నారు. కొం దరు కబ్జా చేసుకున్నారు. అది పెద్దవారి వ్యవహారం. సామాన్య ప్రజల పని కాదు. ఇరు ప్రాంతాల పెద్దవాళ్ళు ఎప్పుడూ స్నేహితులుగానే ఉంటారు. ఆ విషయం సగటు మానవులు తెలుసుకోవాలి.
తెలుగుప్రజల పండగలూ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతా ఒక్కటే! ఆంధ్రా తెలంగాణ మధ్య చిన్న చిన్న తేడాలు ఉంటా యంతే! అవి ఒకరినొకరు గౌరవించుకోవలసినవి. పరిహాసం చేస్తే దానికి ఎవరైనా పరిహారం చెల్లించక తప్పదు. ముఖ్యంగా హైదరాబాద్కి ప్రత్యేకసంస్కృతి ఉంది. ఇక్కడి ప్రజలంతా ఎంతో సంస్కారం కలిగిన ప్రేమజీవులు. అందరినీ తమలో కలుపుకుంటారు. ఒక ఆఫీస్లో ఒకే సెక్షన్లో అన్నిరాషా్ట్రల వారూ, అన్ని మతాలవారు దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తూ కలిసిమెలసి ఉన్నారు అలాగే ఫ్లాట్స్లలో కూడా. మరి నిన్నటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న తెలుగువాళ్ళు ఇప్పు డు కొత్తగా ఫీలింగ్ తెచ్చి పెట్టుకోవడం ఎందుకు? కలిసుందామని ఆంధ్రావారూ, విడిపోదామని తెలంగాణవారు వివిధ కారణాల వల్ల కోరుకున్నారు. తెలంగాణ వారి కోరిక నెరవేరింది కాబట్టి వారు మరింత సంయమనం ప్రదర్శించాలి. అక్కడి వారు న్యూనత చెందకుండా తమలో కలుపుకోవాలి. మీకే ఇబ్బందీ రాదు హాయిగా ఉండం డని ఇతరులకు భరోసా ఇవ్వాలి. నిన్నటివరకూ మనమంతా కలిసున్నది చరిత్రే. దాన్ని చెరపడం కాదు మన పని. కొత్త చరిత్ర సృష్టించాలి. అది ఆదర్శనీయంగా ఉండాలి. తెలుగుభాషా జాతి రెండు శిరసులున్న మహావృక్షం అని చాటాలి. దేశంలోని వివిధ రాషా్ట్రల ముందు మన జాతి చిన్నబోకూడదు.
విడిపోయాక విజయాలు సాధించాలంటే కలిసున్నప్పటి సాక్ష్యాలు చెరిపెయ్యకూడదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్రు లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అందుకోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరిట తెలంగాణలో తెలుగు యూనివర్సిటీ ఉంది. ఇంతకంటే ఆంధ్రా తెలుగు వారి పట్ల తెలంగాణ తెలుగువారి సౌభ్రాతృత్వానికి గొప్ప ఉదాహరణ ఉండబోదు. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఇప్పుడు కొత్తగా రెండు రాషా్ట్రల తెలుగు ప్రజల మధ్యా పుడుతున్న అసహన భావాల్ని వెంటనే అరికట్టకపోతే క్రమంగా ఆంధ్ర ప్రజలు ఇక్కడే ఉంటూ, ఇక్కడి వారి పట్ల వ్యతిరేక భావాలు ప్రోది చేసుకునే ఒక విష సంస్కృతికి పునాదులేసినట్లవుతుంది. అది ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు. సమంజసమూ కాదు. రెండు రాషా్ట్రల ముందూ ఎన్నో సమస్యలున్నాయి పరిష్కరించుకోవడానికి. ఎన్నో సవాళ్ళున్నాయి ఎదుర్కోవడానికి... ఎన్నో విజయాలున్నాయి సాధించుకోవడానికి. ఇరు రాషా్ట్రలను ప్రగతి పథకం వైపు నడిపించే బృహత్తర కార్యసాధనలో అంతరాలు పెరగక పనిచేయాలి. ఇదే ప్రస్తుతం ప్రతి ఒక్క తెలుగువాడి కర్తవ్యం. మన మనసు అద్దాలపై పడిన మరకల్ని సుస్నేహ భావమనే టిష్యూ పేపర్తో తుడిచేద్దాం! తళతళలాడే స్వచ్ఛ మనస్కులుగా మెలుగుదాం!!
- అల్లూరి గౌరీ లక్ష్మి