అల్లూరి గౌరీ లక్ష్మి
ఆంధ్రభూమి, October 1st, 2010
కథల పోటీలో ‘నా తర్వాత’ అనే కధకుగాను ప్రఖ్యాత రచయిత సురేంద్రబాబుకి ప్రథమ బహుమతి వచ్చింది. ఫెళఫెళలాడుతున్న ప్రత్యేక సంచిక తెప్పించుకుని తన కథ చదువుదామని కూర్చున్నాడు సురేంద్రబాబు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
కథ:
అది ఆంకాలజిస్ట్ డాక్టర్ అమర్ రూము. అతను ఎదురుగా కూర్చున్న పేషెంట్ ఈశ్వర్రావు రిపోర్టు చూస్తున్నాడు. డాక్టరు ముఖ కవళికల్ని బట్టి ఏ ప్రమాదమూ ఉండేటట్లు లేదనిపించి ఊపిరిపీల్చుకున్నాడు ఈశ్వర్రావ్. డాక్టర్ తన పర్సనల్ కాల్ ఏదో మాట్లాడుకుంటున్నాడు. ‘పదేళ్ళనుండీ సిగరెట్లు కాలుస్తున్నానని టెస్ట్ చేయించుకోమని పట్టుబట్టింది నిర్మల. అనవసరపు ఖర్చు అనుకున్నాడు ఈశ్వర్రావ్. సెల్ మూసేసి ‘‘మీతో ఎవరూ రాలేదా?’’ అనడిగాడు డాక్టర్. ‘‘ఫర్వాలేదు చెప్పండి’’ నవ్వుతూ అన్నాడు ఈశ్వర్రావ్.
‘‘మీకు గొంతు కేన్సర్ సెకండ్ స్టేజ్‌లో ఉంది’’ పిడుగు పడ్డట్టు డాక్టర్ వైపు చూశాడు ఈశ్వర్రావ్.
‘‘మీరంతగా భయపడక్కర్లేదు. చక్కని మందులున్నాయి’’ అనునయంగా అన్నాడు డాక్టర్.
‘‘మ...మందులున్నాయా?’’ గొంతు పెగిలించుకుంటూ అన్నాడు ఈశ్వర్రావ్.
‘‘అవును. ఇంజెక్షన్స్, మెడిసిన్స్, కీమోథెరఫీ. వీటివల్ల ప్రమాదాన్ని చాలా దూరం జరపొచ్చు.’’
‘‘ఎన్నాళ్ళు?’’ వెర్రిగా అడిగాడు ఈశ్వర్.
‘‘కొన్ని సంవత్సరాలు’’ అన్నాడు డాక్టర్.
‘‘కేవలం కొన్ని సంవత్సరాలు’’ నిర్వేదంగా అన్నాడు ఈశ్వర్.
‘‘అలా అంటే మిగిలినవారందరికీ ఆయుష్షు ఎవరూ రాసివ్వలేదు కదా! ఎవరికైనా ఎప్పుడైనా చావు వేరే దారిలో రావొచ్చు’’.
‘‘ఓదారుస్తున్నారా?’’ నిట్టూరుస్తూ అన్నాడు ఈశ్వర్.
‘‘లేదు వివరిస్తున్నా’’ అంటూ ట్రీట్‌మెంట్ వివరాలన్నీ రాసి ఫైల్ చేతికిచ్చాడు డాక్టర్.
వడివడిగా ఇంటికొచ్చిన ఈశ్వర్ మెదడంతా మొద్దుబారినట్లుగా అనిపించింది. భోజనానికి కూర్చుంటే వాంతయింది. భార్య నిర్మల కంగారుపడుతూ పాలు తెచ్చింది. అవి తాగి పడుకున్నాడు వౌనంగా. తెల్లవార్లూ కంటిమీదికి కునుకు ఒక్క సెకను కూడా రాలేదు. తెల్లవారేటప్పటికి అతని ఆలోచనకి ఒకదారి దొరికి గొప్ప తెగింపు వచ్చింది.
మర్నాడు ఆదివారం భోజనాలయ్యాక నిర్మలనీ, కొడుకు రామూనూ, కూతురు రాధనూ పిల్చి నెమ్మదిగా తనకు కేన్సర్ సోకిన విషయం చెప్పాడు. నిర్మలకి దుఃఖంతో మాట రాలేదు. మ్రాన్పడిపోయింది. పిల్లలిద్దరూ తండ్రిని పట్టుకుని బావురుమన్నారు. ఆ రోజంతా ఇంట్లో ఏడుపు తప్ప మాటలు లేవు.
రెండు రోజులు ఈశ్వరే వంట చేసి వాళ్ళకి తినిపించాడు, బలవంతంగా. మూడో రోజు మామూలుగా ఆఫీసుకి బయలుదేరాడు. పిల్లలిద్దర్నీ కాలేజీకి వెళ్ళమన్నాడు. ఎవరికీ ఏమీ చెప్పొద్దని ముగ్గురిదగ్గరా మాట తీసుకున్నాడు.
మర్నాడు ఉదయం కాఫీలు తాగుతుండగా పిల్లలతో అన్నాడు ఈశ్వర్ ‘‘అమ్మకి ఉద్యోగం చెయ్యాలని కోరిక ఉండేదర్రా! అదిప్పుడు తీరుతుంది. మా ఆఫీసులో అమ్మకి ఉద్యోగం ఇస్తారు’’. వాళ్ళిద్దరూ బిక్కమొహాలు వేశారు. ‘‘నేను చెయ్యను!’’ గట్టిగా ఏడ్చింది నిర్మల. ఆమెను దగ్గరగా తీసుకొని ఓదార్చాడు ఈశ్వర్. పిల్లలిద్దరూ వాళ్ళిద్దరినీ చుట్టుకున్నారు.
ఆ రాత్రి భార్యను దగ్గరగా తీసుకుని ‘‘నిమీ! నేను అనుకోకుండా యాక్సిడెంట్‌కి గురయ్యాననుకో! ఒక్కసారి ఊహించు. దానికన్నా మన పరిస్థితి ఎంతో నయం. అన్నీ చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. నీకూ, పిల్లలకీ ఇబ్బంది కలక్కుండా నేను ఊరికి పది రోజులు వెళ్ళేటప్పుడు నీకు అన్నీ తెచ్చిచ్చి వెళ్ళేవాణ్ణి గుర్తులేదూ! ఇదీ అంతే’’ లాలనగా చెప్పాడు ఈశ్వర్.
‘‘మీరన్నీ పుస్తకాల్లో కొటేషన్లు చెబుతున్నారు. నా స్థానంలో మీరుండి చెప్పండి’’ దుఃఖంతో నిష్ఠూరంగా అంటూ అతన్ని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నిర్మల.
ఒక రోజు ‘‘రామూ! సిటీలో చూడదగ్గ ప్రదేశాలన్నీ లిస్టు చెయ్యరా! మీ అమ్మకిష్టమైన తిరుపతీ, షిరిడీ, యాదగిరిగుట్టతో సహా రాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలో కూడా’’ అంటూ కొడుకుతో అన్నీ రాయించాడు ఈశ్వర్.
‘‘అవి కాదు. ముందు ట్రీట్‌మెంట్’’ అంది బాధగా నిర్మల.
‘‘అదెలాగూ డాక్టర్ చెప్పినట్టే జరుగుతుంది. ఖాళీ దొరికినపుడు ఇవి’’ అన్నాడు ఈశ్వర్ కూతుర్ని పైకెత్తుతూ.
‘‘డాడీ! నీకు తగ్గిపోతుంది’’ అంది రాధ తండ్రి నుదుటిపై ముద్దుపెట్టుకుంటూ. ‘‘అవును డాడీ!’’ అన్నాడు కొడుకు ఆర్తిగా.
‘‘మీ మమీకి చెప్పండిరా! బిక్కమొహం వేసుకోవద్దనీ, నవ్వుతూ ఉండమనీ...’’ అన్నాడు ఈశ్వర్.
తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది నిర్మల. భర్త అంత త్వరగా పరిస్థితికి ఇమిడిపోవడం ఆమెకు మరింత బాధనే కలిగిస్తోంది.
డాక్టర్ ట్రీట్‌మెంట్ ప్రారంభించాడు. ఆ రోజు హాస్పిటల్‌కి నలుగురూ వెళ్లారు. మొదటి ఇంజెక్షన్ చేశారు. ఒక రోజంతా అక్కడే ఉండవలసి వచ్చింది. మర్నాడు ఇంటికి వచ్చేశారు. ఇంజెక్షన్ బాధనుంచి తేరుకోవడానికి ఈశ్వర్‌కి మరో రెండు రోజులు పట్టింది.
తర్వాతి రోజుకి నీరసం తగ్గడంతో ఆఫీసుకు వెళ్ళాడు ఈశ్వర్. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్లారు. నిర్మలకి మరీ దుఃఖం కలిగింది.
ఆ ఆదివారం అంతా సంఘీనగర్‌కి వెళ్ళారు. దేవుళ్ళ దర్శనం చేసుకున్నాక పిల్లలిద్దరూ అటూ ఇటూ తిరుగుతున్నారు. నిర్మల, ఈశ్వర్ కార్పెట్ గడ్డిలో కూచున్నారు. భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంది నిర్మల.
‘‘నిర్మలా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నాకైతే ఏ దిగులూ కలగడంలేదు. మరణం కోసం ఎదురుచూస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా ఎదురుచూడడం ఒక మనోహరమైన అనుభవం అనిపిస్తోంది. అసలు నేను త్వరలో ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అనగానే నా మనసు ప్రశాంతంగా మారిపోయింది. జీవితమే అన్ని బాధలకీ, భయాలకీ మూలమేమో నిర్మలా!’’ ఆమె వైపు నవ్వుతూ చూస్తూ అన్నాడు ఈశ్వర్.
‘‘మీరు వేదాంతం చెప్పకండి’’ అంది నిర్మల బాధగా.
‘‘మీరు ముగ్గురూ నేను లేకపోయినా కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఎవరో ఇచ్చే ఆప్తస్పర్శకోసం అల్లల్లాడకూడదు. మరి సానుభూతికి ఆశపడకూడదు. నేనెప్పుడూ నీ తోడుగానే ఉంటాను నీ ఊపిరిలో ఊపిరిగా. నాతో చర్చించి నీకు తోచినట్టు చెయ్యి. పిల్లలకి మంచి ఉద్యోగాలొస్తాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నీకు మనోధైర్యం కలగాలని భగవంతుణ్ణి కోరుకున్నాను’’ నిర్మలని లేవదీస్తూ అన్నాడు ఈశ్వర్.
‘‘నాన్నగారు తన కథ తనే చదువుకుంటున్నార్రోయ్!’’ అన్న రాణీ గొంతు విని కథ చదవడం ఆపాడు సురేంద్ర.
‘‘కంగ్రాట్స్ డాడ్!’’ పిల్లలిద్దరూ మంచి నీళ్ళు తాగుతూ కోరస్‌గా అరిచారు. ‘‘మమీ మా ఇద్దరికీ చదివి వినిపించేసింది మీ కథ’’.
రాణీ పక్కనే కూర్చుంటూ ‘‘సూపర్బ్. అంత మెచ్యూర్డ్‌గా ఎలా రాస్తారండీ బాబూ!’’ నిజంగా మరణాన్ని అలా సులువుగా స్వీకరించగలమా! దేహత్యాగానికి అలా సిద్ధపడగలమంటారా! కానీ అలా చేయడం బావుంది. ఎంత ఆదర్శంగా ఆలోచిస్తారో మీరు!’’ అంది భర్తవైపు ఆరాధనగా చూస్తూ.
***
రచయిత సురేంద్రబాబు ఒక నేషనలైజ్ బాంక్ నుంచి వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నాడు, పూర్తి టైం రచయితగా మారాలని. గత రెండేళ్ళుగా మూడు పుస్తకాలు ఆవిష్కరించాడు. ఈ మధ్య మూడు నెలలుగా అతనికి నిరుత్సాహంగా ఉంటోంది. తరచుగా జ్వరం వస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుని ఆ తర్వాత మాస్టర్ చెకప్ చేయించుకున్నాడు. రిపోర్టులిస్తూ కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్లో ఒక డాక్టర్‌కి రిఫర్ చేశాడు. మర్నాడు రాణి వస్తున్నానంటున్నా వద్దని డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు సురేంద్ర. అతని రిపోర్టులన్నీ వివరంగా చూశాడా డాక్టర్. ఆయన కాన్సర్ స్పెషలిస్ట్.
‘‘సురేంద్రగారూ! ఒకరకంగా మీరు అదృష్టవంతులేననుకోండి. మీకు లింఫ్‌నాడ్యూల్స్‌కి చాలా తక్కువగా కేన్సర్ సోకింది. ఒక విధంగా ఫస్ట్ స్టేజ్‌లోనే ఉంది. ఈమధ్యే ఒక పేషెంట్ వైజాగ్ నుంచి వచ్చి వెళ్ళాడు. అతను గత ఏడెనిమిదేళ్లుగా మీలాంటి సమస్యతోనే వైద్యం చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ కేన్సర్ అన్ని కేన్సర్‌లలోకి అతి తక్కువ ప్రమాదకరమయింది. మీరు అధైర్యపడకండి. నన్ను నమ్మండి. మీకు నయమయిపోతుంది. రోజురోజుకీ ఇంకా మంచి మందులు వస్తున్నాయి. వీలైనంత త్వరగా వైద్యం ప్రారంభిద్దాం’’ అన్నాడు డాక్టర్ ఎంతో దయగా.
సురేంద్రకు మెదడు మొద్దుబారిపోయింది. అసలు తనెక్కడ ఉన్నాడో అన్న సంగతి కూడా తోచక టేబిల్ మీద తలవాల్చేశాడు. డాక్టర్ చాలాసేపు ఓదార్చిన తర్వాత సురేంద్ర ఇంటినంబర్ ఇచ్చాడు. పిచ్చిచూపులు చూస్తూ షాక్ తిన్నట్టుగా ఉండిపోయాడు. రాణీ వచ్చాక కొంచెం తేరుకున్నాడు. డాక్టర్ ఆమెకు అన్నీ వివరంగా చెప్పి ధైర్యం చెప్పాడు. ఆమె గుండె దిటవు చేసుకుని భర్తను ఇంటికి తీసుకుని వెళ్ళింది.
మంచంపై పడుకుంటూ అన్నాడు సురేంద్ర ‘‘నా కథలోని పాత్ర నన్ను శపించింది’’. రాణి గుండె చెరువైంది అతని మాటలకి. అతనె్నలా ఓదార్చాలో తోచలేదామెకి.
‘‘ఆ హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ చేయించుకోమనీ పది సంవత్సరాలు గారంటీ ఇస్తామనీ అన్నాడండీ డాక్టరు!’’ అంది రాణి ఉద్వేగంతో బాధని అణచుకుంటూ.
‘‘నా అవసరం నీకు పదేళ్ళేనా! ఆ తర్వాత అఖ్ఖర్లేదా?’’ భర్త సూటి ప్రశ్నకు ఆమె చిగురుటాకులా వణికిపోయింది.
‘‘కాదండీ! మనమింకా అదృష్టవంతులమని ఆయనన్నాడు. మిగిలిన కాన్సర్లయితే సంవత్సరం కంటే కష్టమనీ డాక్టరనడంతో నేనలా అనేశాను. క్షమించండి’’ అంది రాణి కన్నీరు తుడుచుకుంటూ.
సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళు బెదిరిపోకుండా డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే చెప్పింది వాళ్ళకి. చిన్నకొడుకు ‘‘అమ్మా! మనం తిరుపతి మెట్లెక్కి వెళదాం అమ్మా! నాన్నకి తగ్గిపోతుంది’’ అన్నాడు. ‘‘అవునమ్మా!’’ అన్నాడు పెద్దవాడు.
పిల్లలిద్దర్నీ దగ్గరికి తీసుకుని తల్లిదండ్రులకి ఫోన్ చేసింది రాణి. రెండు రోజులు ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. పిల్లలు స్కూలుకి వెళ్ళలేదు. మూడోరోజుకల్లా రాణి తల్లీ, తండ్రీ వచ్చారు. వాళ్ళని చూడగానే సురేంద్రతో సహా నలుగురూ కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళు పిల్లల్ని స్కూలుకి పంపి, డాక్టర్‌ని కలిసి వచ్చారు. రెండు రోజులు అందరికీ ధైర్యం చెప్పారు. ట్రీట్‌మెంట్ దగ్గరుండి మొదలుపెట్టించారు. సురేంద్రకీ, రాణికి భయపడవద్దని చెప్పి వారం రోజుల్లో వస్తామని ఊరికి వెళ్ళారు.
మర్నాడు ఆరోగ్యంతో నవనవలాడుతూ దిగిన బావమరిదిని చూడగానే సురేంద్రలో ఈర్ష్య భగ్గుమంది. నాకే రావాలా ఈ రోగం! ప్రపంచంలో ఎంతమంది లేరూ? కసిగా అనుకున్నాడు. బావమరిదితో ముక్తసరిగా మాట్లాడాడు.
సురేంద్ర బాంకు ఫ్రెండ్స్ అంతా వచ్చారొక రోజు. ‘‘మీరంతా కనీసం పార్టీలు చేసుకునేటప్పుడైనా నన్ను గుర్తుచేసుకోండి’’ నిష్ఠూరంగా అన్నాడు వాళ్ళతో.
‘‘నీకేం కాదురా! వదిన గారంతా చెప్పారు. నీకు తగ్గిపోతుందిరా’’ అన్నాడు ఫణి ఆప్యాయంగా.
‘‘మీ అందరికీ ఆనందంగా ఉండి ఉంటుంది, ఆ కేన్సరేదో మనకి రాలేదు అని. అందుకే అంతా వచ్చారు...’’ అందరివైపూ ఉక్రోషంగా చూస్తూ అన్నాడు సురేంద్ర. వచ్చిన వాళ్ళంతా చటుక్కున లేచి నిలబడ్డారు.
‘‘ఆయన అప్‌సెట్ అయి ఉన్నారు. మీరేం అనుకోవద్దు’’ అందరివంకా దీనంగా చూస్తూ అంది రాణి. అంతా బయలుదేరారు వౌనంగా. ఫణి మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘మాకు నిజంగా బాధనిపించే మిత్రులుగా వచ్చాంరా! నమ్ము’’ అంటూ సురేంద్ర వీపు తట్టాడు.
వాళ్ళు వెళ్ళాక భర్తను ఏదో అనబోయి తనని కూడా అలా అనొచ్చు అన్న భావన కలిగి వంటింట్లోకి వెళ్లిపోయింది రాణి. మరో రెండు రోజులకి సురేంద్ర తల్లీ తండ్రి వచ్చారు. కొడుకు సంగతి విని విలవిల్లాడిపోయారు. వారిని ఓదార్చడం రాణీ, పిల్లల వంతయింది.
ముసలి తల్లిదండ్రుల్ని చూడగానే సురేంద్రకి చిరాకు కలిగింది. ‘‘వీళ్లైతే డెబ్భై ఏళ్ళు వచ్చినా బ్రతికేస్తూ ఉంటారు. నేను మాత్రం యాభై రాకుండానే పోవాలి’’ కచ్చగా అనుకున్నాడు. ఆపుకోలేక ఒక రోజు తల్లితో కోపంగా అనేశాడు కూడా ‘‘నువ్వసలు కొడుకు ఆయుష్షు కోసం ఒక్క పూజైనా చేశావా?’’ అని.
‘‘నేనేం చేతురా తండ్రీ! నేనెవరినీ ఏనాడూ బాధపెట్టలేదురా దైవసాక్షిగా’’ అంటూ ఆమె కన్నీరు మున్నీరయింది. రాణికి భర్త ప్రవర్తన చూస్తుంటే అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. పిల్లలు కూడా భయపడుతున్నారు.
రెండు నెలలు గడిచాయి. సురేంద్ర మందులు వేసుకుంటున్నాడు. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళుతున్నాడు. అతనితో వద్దన్నా రాణీ కూడా వెళుతోంది. ఇంకొంత కాలం అయ్యాక ఇంజెక్షన్స్ మొదలుపెడతామన్నాడు డాక్టర్.
సురేంద్ర ఎవరితోనూ మాట్లాడడంలేదు. టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు. లేదంటే వెర్రిగా నిద్రపోతున్నాడు.
ఒక రోజు ధైర్యం చేసుకుని అంది రాణి ‘‘మీరిలా అధైర్యపడితే ఎలాగండీ! ఎంత ధైర్యం ఇచ్చే రచనలు చేసేవారు మీరు!’’ అని. సురేంద్ర వెంటనే లేచి రాక్‌లో ఉన్న తను రాసిన నవలలూ, కథా సంపుటాలూ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ తీసి విసిరికొట్టాడు. అవాక్కయింది రాణి. మాట్లాడకుండా ఆ పుస్తకాలన్నీ తీసి పిల్లల గదిలో దాచి వచ్చింది. సురేంద్ర కనీసం పిల్లలతో కూడా మాట్లాడకపోవడం అందరికీ బాధ కలిగిస్తోంది. రాణి నిత్యం గుడికి వెళ్ళి ఒక గంట పూజలు చేసి వస్తోంది.
ఒక రోజు సాయంత్రం మేడ మెట్లమీద కూర్చున్నాడు సురేంద్ర. అతని మనసంతా అల్లకల్లోలంగా, దిగులుగా, శూన్యంగా అనిపిస్తున్నది. హఠాత్తుగా అతని మనసులో నేనొకసారి గుడికి వెళితే! అన్న ఆలోచన కలిగింది. వెంటనే బయలుదేరాడు. కాళ్ళు కడుక్కుని క్యూలో నిలబడ్డాడు. అందరితోబాటు నిశ్శబ్దంగా భగవంతుణ్ణి ప్రార్థించాడు, చేతులు జోడించి. బంగారు పూతతో వెంకటేశ్వరుడు గుడిలో మెరిసిపోతున్నాడు. చిరునవ్వుతో అభయహస్తం చూపుతున్నాడు.
స్వామి విగ్రహాన్ని తదేకంగా చూడగానే సురేంద్ర దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది. ఆయన తన వైపు చూసి ధైర్యాన్ని ప్రసారం చేసినట్టనిపించింది. ఏ కోరికా వెల్లడించకుండా వెనుదిరిగాడు. ఎవరో ఆపి చేతిలో ప్రసాదంగా పెట్టిన శనగల్ని నోట్లో వేసుకున్నాడు. పక్కనే ఉన్న మంటపం మెట్లెక్కి కూర్చున్నాడు. భక్తులందర్నీ చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. క్రమంగా అతని మనసులోంచి ఒక సంఘర్షణ తొలగిపోయింది. అతని దుఃఖం ఒక్కసారిగా జీర్ణమయినట్లనిపించింది. తన వ్యాధిని ఎదుర్కొనే ధైర్యం వచ్చినట్టనిపించింది.
లేచి చకచకా ఇంటికి వచ్చాడు. ‘‘రాణీ! నా బహుమతి కథ ఇస్తావా?’’ అడిగాడు సోఫాలో కూర్చుంటూ. రాణీ ఫోల్డర్‌లో దాచిపెట్టిన అతని కధ తెచ్చి ఇచ్చింది.
సురేంద్ర కథ తీసి చదవడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. కథ చదవడం పూర్తిచేశాడు. ఎంత అద్భుతంగా రాశాను!
ఈ కథ నేనే రాశానా! మరణం కోసం ఎదురుచూడడం ఓ మనోహరమైన అనుభవం. ఎంత మంచి వాక్యం! నా కధ నాకే ఈ దుఃఖపు చీకటిలో కరదీపికలా ఉంది. అజ్ఞానాంధకారంలో జ్ఞానజ్యోతిలా ఉంది.
ఈ మాటల కూర్పు ఎవరో నాకోసమే కుదిర్చి నా చేత రాయించారు. ఈ కథ నాతోనే ఉండాలి నిరంతరం అనుకున్నాడు ఆర్తిగా ఫోల్డర్‌ని గుండెల కానించుకుంటూ. కొంతసేపయ్యాక తల్లిదండ్రుల్నీ, భార్యనీ, పిల్లల్నీ పిలిచి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అటూ, ఇటూ. అందరివైపూ చూశాడు.
‘‘నేను ఇన్నాళ్ళూ చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరంతా పెద్దమనసుతో నన్ను క్షమించి ఓదార్చారు’’ అన్నాడు బాధతో గొంతు బొంగురుపోగా.
అందరి మనస్సులూ కలుక్కుమన్నాయి. ఉద్వేగంతో మళ్లీ అన్నాడు ‘‘రాణీ! నేను రాసిన కథ, ఈ బహుమతి పొందిన కథ నాకు మార్గదర్శి అయ్యింది. సరస్వతీ మాత ఈ కథని నాకు ఔషధంలా తయారుచేసి ఉంచింది.’’
పది చేతులు అతన్ని ఆప్యాయంగా నిమిరాయి. సురేంద్ర చేతులు చాచి అందరినీ దగ్గరకు పొదువుకున్నాడు ఆప్యాయంగా.
Subscribe to:
Post Comments (Atom)
ఈ కథని మొదటిసారి ఆంధ్ర భూమి డైలీలో చదివాను. ఇప్పుడు రెండోసారి. చాలా బాగా వ్రాశారు గౌరి గారూ.
ReplyDelete